Afghanistan: వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం... ఇంగ్లండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
- వరల్డ్ కప్ లో ఇవాళ ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
- ఛేదనలో 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్
- ముజీబుర్ కు 3, రషీద్ ఖాన్ కు 3 వికెట్లు
భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. ఆసియా జట్టు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ల విజృంభణతో ఇంగ్లండ్ కుదేలైంది. 285 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.
ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. సీనియర్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 3 వికెట్లతో సత్తా చాటాడు. మహ్మద్ నబీ రెండు వికెట్లు తీసి తన వంతు సహకారం అందించాడు. పేసర్లు ఫజల్ హక్ ఫరూఖీ 1, నవీనుల్ హక్ 1 వికెట్ తీశారు.
గత వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఈ వరల్డ్ కప్ లోనూ ఫేవరెట్ గా అడుగుపెట్టింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై నెగ్గి ఆత్మవిశ్వాసం పుంజుకుంది. అయితే, నేడు ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో అనూహ్యరీతిలో పరాజయం పాలైంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే ఇంగ్లండ్ చేసిన తప్పిదమైంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్, నబీ, ముజీబుర్ రెహ్మాన్ వంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఉన్నారన్న సంగతి విస్మరించి ఛేజింగ్ కు మొగ్గు చూపింది. ఆఫ్ఘన్ జట్టులోని ముగ్గురు స్పిన్నర్లే 8 వికెట్లు తీయడం విశేషం.
ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే హ్యారీ బ్రూక్ 66 పరుగులు చేశాడు. ఓపెనర్ డేవిడ్ మలాన్ 32, అదిల్ రషీద్ 20, మార్క్ ఉడ్ 18, రీస్ టాప్లే 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టులో జానీ బెయిర్ స్టో (2), జో రూట్ (11), కెప్టెన్ జోస్ బట్లర్ (9) విఫలం కావడం ఇంగ్లండ్ అవకాశాలను దెబ్బతీసింది. లియామ్ లివింగ్ స్టన్ (10), శామ్ కరన్ (10) ఆకట్టుకోలేకపోయారు. ఎనిమిదో స్థానం వరకు ఇంగ్లండ్ కు బ్యాటింగ్ వనరులు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ స్పిన్నర్లదే పైచేయి అయింది.