KCR: ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు: సీఎం కేసీఆర్
- జనగామలో బీఆర్ఎస్ సభ
- మనం ఎలా ఓటు వేస్తామో మన కర్మ అలానే ఉంటుందన్న కేసీఆర్
- మంచి చెడు చూసి ఓటేయాలని పిలుపు
- కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో పడేయాలని వ్యాఖ్యలు
జనగామ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ విపక్షాలపై ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ను తీసేసి బంగాళాఖాతంలో వేయాలని విపక్షాలు అంటున్నాయని, రైతుల మీద మళ్లీ అధికారులను రుద్దాలని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.
ఎన్నికలప్పుడు వచ్చి కొందరు ఆపద మొక్కులు మొక్కుతుంటారని, అలాంటి వాళ్లను నమ్మొద్దని అన్నారు. మనం ఎలా ఓటు వేస్తామో మన కర్మ అలానే ఉంటుందని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మంచి చెడు చూసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇక, ఓట్ల కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ ఖండించారు. ఓట్ల కోసం అబద్ధాల మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.