kilaru rajesh: నన్నడిగిన 25 ప్రశ్నల్లో 10 మాత్రమే స్కిల్ కేసుకు సంబంధించినవి: కిలారు రాజేశ్
- చంద్రబాబును ఎదుర్కోలేక స్కిల్ కట్టుకథ అల్లారని విమర్శ
- రేపు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి
- ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పానన్న కిలారు రాజేశ్
చంద్రబాబును ఎదుర్కోలేక స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో కట్టుకథను అల్లారని టీడీపీ నేత కిలారు రాజేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి కిలారు రాజేశ్ స్కిల్ కేసులో నేడు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేపు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తన న్యాయవాది సమక్షంలో విచారణ జరిపినట్లు చెప్పారు.
ఈ రోజు సీఐడీ అధికారులు తనను 25 ప్రశ్నలు అడిగారన్నారు. ఇందులో స్కిల్ కేసుకు సంబంధించి పది ప్రశ్నలు ఉన్నాయని, మిగతావి వ్యక్తిగతమైనవి అన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సీఐడీకి స్పష్టంగా చెప్పానన్నారు.
కాగా, విచారణలో లోకేశ్‌తో పరిచయం, వ్యాపారాలు, షెల్ కంపెనీలు, చంద్రబాబు-లోకేశ్‌తో జరిపిన మెయిల్స్ సంభాషణ తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
స్కిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ కేసులో రాజేశ్ ను నిందితుడిగా చేర్చలేదని, అవసరమైతే సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఆ మేరకు రెండ్రోజుల కిందట రాజేశ్ కు సీఐడీ నోటీసులు అందించింది.