KTR: సిరిసిల్లకు ఎప్పుడు వచ్చినా కార్యాలయంలో చాయ్ తాగి వెళ్లండి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తే కౌంటర్ ఇవ్వాలని నేతలకు, కార్యకర్తలకు సూచన
- కాంగ్రెస్, బీజేపీ బాస్లు ఢిల్లీలో ఉంటే, మన బాస్లు గల్లీలో ఉంటారని వ్యాఖ్య
- తెలంగాణను కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించే వారికే ఓట్లు వస్తాయన్న కేటీఆర్
- పార్టీ కార్యాలయాన్ని తక్కువ ఖర్చుతో శుభకార్యాలకు ఇవ్వాలని సూచన
కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తే, వెంటనే కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. సిరిసిల్లలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్యాలయంలో నాయకులు ప్రతిరోజు ప్రెస్మీట్లు పెట్టాలన్నారు. అవతలి వాళ్లకు సరైన రీతిలో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ బాస్లు ఢిల్లీలో ఉంటారని, మన బాస్లు గల్లీలో ఉంటారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీ దుప్పటి కప్పుకున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లకే ఓట్లు వస్తాయని, అంతేకానీ ముఖ్యమంత్రిని తిడితే రావన్నారు. మన మేనిఫెస్టో మనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం ఆనాడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇస్తే, నాటి ప్రభుత్వం తమను ఖాళీ చేయించిందని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నమని, పార్టీ శాశ్వతంగా ఉండాలనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేస్తున్నామన్నారు. పార్టీ కార్యాలయం కేవలం నేతలది మాత్రమే కాదని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తదని అన్నారు. పార్టీకి 60 లక్షల సైన్యం ఉందన్నారు. గులాబీ జెండా అంటే పేదల జెండా అన్నారు. కార్యకర్త ఇంట్లో శుభకార్యాలు ఉంటే పార్టీ కార్యాలయాన్ని తక్కువ ఖర్చుతో ఇవ్వాలని సూచించారు.
కార్యకర్తలు ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా పార్టీ కార్యాలయంలో చాయ్ తాగి వెళ్లాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పార్టీ కార్యాలయంలో ఇచ్చినా తీసుకొని, పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఓటర్లను ఒప్పించి, మెప్పించి ఓట్లు అడగాలన్నారు. 45 రోజులు తమ కోసం పని చేయాలని, ఆ తర్వాత ఐదేళ్లు మేం మీ కోసం పని చేస్తామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.