Pattabhi: ఉండవల్లి అరుణ్ కుమార్ ముసుగు తొలగిపోయింది: పట్టాభి
- స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలన్న ఉండవల్లి
- హైకోర్టులో పిటిషన్ దాఖలు
- తాడేపల్లి నుంచి వచ్చిన కాగితాలనే ఉండవల్లి జతచేశారంటూ పట్టాభి ఫైర్
- పిటిషన్ లో ఏముందో తెలియకుండా సంతకం పెట్టారా అంటూ ఆగ్రహం
స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఇంతకీ తను దాఖలు చేసిన పిటిషన్ లో ఏముందో ఉండవల్లి చదివారా? అని ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి కొన్ని కాగితాలు వస్తే అవేంటో కూడా చూడకుండా పిటిషన్ కు జత చేసి సంతకం పెట్టేస్తారా? అని నిలదీశారు. వాస్తవాలన్నీ ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోనే ఉన్నప్పటికీ, తమపై బురదజల్లుతున్నారని పట్టాభి మండిపడ్డారు.
"ఇన్నాళ్లు తటస్థ శిఖామణిగా ఉన్న ఉండవల్లి ఇటీవల కాలంలో నిస్సిగ్గుగా ముసుగు తీసేశాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో కేంద్రాలే లేవంట... అసలు పరికరాలే రాలేదంట... ఏమీ లేని ఈ ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని కొన్ని వందల కోట్ల అవినీతి జరిగిందంట!
అయ్యా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారూ... మీరు ఏ థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ ఆడిట్ గురించి మాట్లాడారో, ఆ నివేదికను కూడా మీరు పిటిషన్ లో జతపరిచారు. శరత్ అసోసియేట్ వాళ్లు మేం ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు అని స్పష్టంగా చెప్పారు. స్కిల్ సెంటర్లకు వెళ్లి పరిశీలించలేదని నివేదికలో రాసి ఉంది. ఉండవల్లి కనీసం ఆ నివేదిక చదివారా? దీన్నిబట్టి... తాడేపల్లి ప్యాలెస్ పంపిన కాగితాలను చదవకుండానే సంతకాలు చేశాడని అర్థమవుతోంది.
మీరు (ఉండవల్లి) నిజంగా నివేదిక చదివి ఉంటే, "శరత్ అసోసియేట్స్ వాళ్లు అన్నీ పరిశీలించారు, వస్తువులన్నీ పోయాయని కనుగొన్నారు" అని మీరు మాట్లాడారు. ఇక, సీమెన్స్ కు తెలియకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారట... అయ్యా ఉండవల్లి గారూ చదవండి సార్ మీరు... ఏం చదవకుండానే హైకోర్టులో పిటిషన్ ఎలా వేశారు?
మీరు పిటిషన్ కు జత చేసిన డాక్యుమెంట్ లోనే సీమెన్స్ డైరెక్టర్ సంతోష్ సావంత్ అనే వ్యక్తి ఒప్పందంపై సంతకం చేశాడని తాటికాయలంత అక్షరాలతో రాసి ఉంది. మీరు దాఖలు చేసిన పిటిషన్ లోనే ఇన్ని వాస్తవాలు ఉంటే ఇక మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారం బురదజల్లితే ప్రజలెవరూ హర్షించరు.
రూపాయి కూడా అవినీతి జరగని అంశంలో మీరు సీబీఐ విచారణ కోరారు. మరి అదే పని లిక్కర్ విషయంలో ఎందుకు చేయలేదు? అని మేం అడిగితే, నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... నా వద్ద లిక్కర్ అంశానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదండీ... నాకెలా వస్తుందండీ సమాచారం... సమాచారం లేకుండా నేను పిటిషన్ ఎలా వేస్తానండీ అని చెబుతాడు.
ఇదే ఉండవల్లి రెండేళ్ల క్రితం టేబుల్ పై వరుసగా లిక్కర్ బాటిళ్లు పేర్చుకుని ప్రెస్ మీట్ పెట్టలేదా? క్వార్టర్ లిక్కర్ తయారు చేయడానికి ఇంతే అవుతుంది... ప్రభుత్వానికి రూ.37 మార్జిన్ మిగులుతుంది... చీప్ లిక్కర్ అమ్మకాల్లోనే ఇంత మార్జిన్ ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు మింగేస్తున్నారో... పొరుగు రాష్ట్రాల్లో లిక్కర్ రేట్లు ఒకలా ఉంటే, మన రాష్ట్రంలో మరోలా ఉన్నాయి... పొరుగు రాష్ట్రాల్లో ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్ముతుంటే, ఇక్కడేమో కొత్త బ్రాండ్లు ఉన్నాయి అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు!... ఇప్పుడేమో సమాచారం లేదంటారా?
ఆ రోజున మీరేమన్నారు... వీళ్ల అంతు తేలుస్తా అనలేదా? ఆర్టీఐ ద్వారా చాలా ప్రశ్నలు అడిగాను... నాకు చాలా సమాచారం వచ్చేస్తోంది అంటూ మీడియా ముందు మీరు మాట్లాడారా, లేదా? ఆర్టీఐ కింద మీరడిగిన ప్రశ్నలు ఏమైపోయాయి ఉండవల్లి గారూ?" అంటూ పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.