Allu Arjun: రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్
- ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- 'పుష్ప' సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
- బన్నీకి జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద అల్లు అర్జున్ కు ఓ జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మార్మోగిపోయింది.
అంతకుముందు, అల్లు అర్జున్ ను అవార్డుల కార్యక్రమం వద్ద జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ అవార్డు అందుకోనుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. పుష్ప ఓ కమర్షియల్ చిత్రం అని, అలాంటి చిత్రానికి జాతీయ అవార్డు అంటే నిజంగా డబుల్ అచీవ్ మెంట్ అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఇదంతా ఆంగ్లంలో వివరించిన అల్లు అర్జున్ చివర్లో ఏమన్నారంటే... "ఈ ఒక్క మాట మాత్రం నా మాతృభాషలో చెబితేనే నాకు బాగుంటుంది" అంటూ "తగ్గేదే లే" అనే డైలాగ్ చెప్పారు.