Jagan: జగన్ పై కోడికత్తితో దాడి కేసు... స్టే విధించిన ఏపీ హైకోర్టు
- గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి
- కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు
- లోతైన విచారణ జరపాలంటున్న సీఎం జగన్
- సీఎం పిటిషన్ కొట్టివేసిన ఎన్ఐఏ కోర్టు
- ఎన్ఐఏ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సీఎం జగన్
గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి జరగడం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ కొట్టివేతకు గురైంది. దాంతో సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టు నిర్ణయాన్ని ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ కేసులో పూర్తి వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే విచారణ జరుపుతున్నారని, కొన్ని అంశాల ఆధారంగానే ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందని సీఎం జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావు నేరచరిత్ర కలిగిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో ఉద్యోగం ఇచ్చారని, ఇందులోని కుట్ర కోణాన్ని వెలికితీసేలా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని హైకోర్టుకు విన్నవించారు.
సీఎం జగన్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు... ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. 8 వారాల పాటు ఎన్ఐఏ కోర్టులో విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కోడికత్తితో దాడి కేసులో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.