Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం... విచారణ ఈ నెల 20కి వాయిదా
- స్కిల్ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు
- తన పేరును కొట్టివేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్
- సుప్రీంకోర్టులో నేటితో ముగిసిన విచారణ
- మొదట తీర్పును రిజర్వ్ లో ఉంచిన ద్విసభ్య ధర్మాసనం
- ఆ తర్వాత శుక్రవారానికి వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన పేరును కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ కేసులో ఇవాళ చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఈ కేసులో మిగిలిన వాదనలు ఏవైనా ఉంటే వాటిని లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయవాదులకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ద్విసభ్య ధర్మాసనం సూచించింది. వాదనలు విన్న పిమ్మట, తొలుత తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం... కాసేపటి తర్వాత విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
కాగా, ఇవాళ్టి విచారణలో ప్రధానంగా వాదనలన్నీ 17ఏ అంశం చుట్టూనే జరిగాయి. హరీశ్ సాల్వే కూడా ఈ సెక్షన్ పైనే వాదనలు వినిపించారు. 17ఏ చట్టసవరణ తర్వాతే స్కిల్ వ్యవహారంలో దర్యాప్తు మొదలైందన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సెక్షన్ 17ఏ చట్టసవరణలు 2018లో జరిగాయని, స్కిల్ ప్రాజెక్టు 2015-16 నాటిదని వివరించారు.
సవరించిన చట్టం మేరకు 17ఏ ప్రకారం పిటిషనర్ (చంద్రబాబు)కు చట్టపరమైన రక్షణలు వర్తిస్తాయని వివరించారు. ఈ క్రమంలో హరీశ్ సాల్వే పలు తీర్పులను ప్రస్తావించారు. 1964 నాటి రతన్ లాల్ కేసును, 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును సాల్వే ఉటంకించారు.
స్కిల్ కేసులో 17ఏ అనేది అత్యంత కీలకమైన విషయం అని వివరించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17ఏ ఉందని స్పష్టం చేశారు. 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని హరీశ్ సాల్వే పేర్కొన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు వరకు ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదని అన్నారు. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో చాలామంది అధికారులను విచారించామని సీఐడీ చెప్పిందని, కానీ ఒక్కరికి కూడా 17ఏ కింద అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని సాల్వే విన్నవించారు. న్యాయసమీక్ష జరిపితే కేసు మొత్తం మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారని, ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారని వివరించారు. ఏ అంశాన్ని ఏ అంశంతో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని సాల్వే వాదనల సందర్భంగా వ్యాఖ్యానించారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్ల నిండా ఆరోపణలనేనని వెల్లడించారు. ప్రతిపక్ష నేతను విచారించడం తమ హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ కేసును ఏ కోణంలో చూసినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుందని హరీశ్ సాల్వే ఉద్ఘాటించారు.
"2016-17 నాటి విచారణలో ఏమీ తేలలేదు. దాంతో, 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. 73 ఏళ్ల చంద్రబాబు గత 40 రోజులుగా జైల్లో ఉన్నారు. దయచేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టు సెలవుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ పై పరిశీలించండి" అంటూ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
అయితే, సాల్వే వాదనల పట్ల ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఈ కేసులో తీర్పు ఇచ్చేటప్పుడు మధ్యంతర బెయిల్ ఎందుకని ప్రశ్నించారు. అనంతరం, ఈ కేసులో ఇంతటితో విచారణ ముగిస్తున్నట్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.