CM KCR: నన్ను విజేతగా నిలిపిన ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: సీఎం కేసీఆర్
- సిద్ధిపేట ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్
- సిద్ధిపేట గడ్డ తనకు అన్నీ ఇచ్చిందని వెల్లడి
- తెలంగాణ ఉద్యమానికి ఇక్కడే పునాది పడిందని వ్యాఖ్యలు
ఇవాళ సిద్ధిపేట ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ భావోద్వేగాలతో కూడిన ప్రసంగం చేశారు. సిద్ధిపేట గడ్డ తనకు అన్నీ ఇచ్చిందని తెలిపారు. తనకు సానబెట్టి, పెద్దవాడ్ని చేసి, చదువు చెప్పిందీ... రాజకీయంగా జన్మనిచ్చిందీ సిద్ధిపేట గడ్డేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఓ నాయకుడ్ని చేసి, తెలంగాణ సీఎం అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లిందని అన్నారు.
దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణను ముందుకు తీసుకెళుతున్నామంటే సిద్ధిపేట గడ్డ అందించిన బలమేనని తెలిపారు. ప్రతి సందర్భంలో తనను విజేతగా నిలిపిన సిద్ధిపేట రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బంగారం వంటి భూములున్నా నీళ్లు లేక ఒకప్పుడు పంటలు పండించుకోలేకపోయామని, సిద్ధిపేటలో నీళ్ల కరవు వస్తే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని వెల్లడించారు. ఒక్క బోరు కూడా పడని స్థితిలో లోయర్ మానేరు నీళ్లతో జాతర చేసుకున్నామని, ఇవాళ తెలంగాణ అంతా అమలవుతున్న మిషన్ భగీరథకు నాటి సిద్ధిపేట మంచినీటి పథకమే స్ఫూర్తి అని వివరించారు. తెలంగాణ ఉద్యమం సాధించడానికి కూడా సిద్ధిపేట గడ్డమీదే పునాది పడిందని కేసీఆర్ పేర్కొన్నారు.