Allu Arjun: సుకుమార్ గారూ... ఈ ఘనత మీదే: అల్లు అర్జున్
- పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు
- నేడు ఢిల్లీలో జాతీయ అవార్డుల కార్యక్రమం
- రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బన్నీ
పుష్ప చిత్రంలో అద్భుతమైన నటనకు గాను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు.
"ఈ పురస్కారంతో నన్ను గుర్తించినందుకు ఈ సందర్భంగా నేను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు, జాతీయ అవార్డుల జ్యూరీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు ఓ వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు... సినిమాను ఆదరించి, మద్దతు తెలిపిన వారందరికీ ఇది చెందుతుంది. థాంక్యూ సుకుమార్ గారూ... నేను ఈ ఘనత సాధించడానికి మీరే కారణం" అంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో టాలీవుడ్ సందడి
ఇక, ఈ అవార్డుల కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. ఆర్ఆర్ఆర్ బృందానికి కూడా అవార్డులు రావడంతో కార్యక్రమంలో కోలాహలం నెలకొంది. పుష్ప చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డును స్వీకరించగా, ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ పాప్యులర్ ఫిల్మ్ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం అందించినందుకు ఎంఎం కీరవాణి, బెస్ట్ సింగర్ గా కాలభైరవ (ఆర్ఆర్ఆర్ లో కొమురంభీముడో పాటకు), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) కూడా రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో 'ఉప్పెన' చిత్రానికి గాను దర్శకుడు సానా బుచ్చిబాబు, నిర్మాత నవీన్ యెర్నేని అవార్డును స్వీకరించారు. ఉత్తమ గీత రచయిగా చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్), ఉతమ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) కూడా అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.