AFG Vs ENG: నన్ను వాటేసుకుని కన్నీరుపెట్టుకుంది భారతీయ చిన్నారే: ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్
- ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ విజయం తరువాత ఓ కుర్రాడి భావోద్వేగం
- ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్‌ను కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చిన వైనం
- బాలుడు ఆఫ్ఘన్ కుర్రాడేనని భావించిన ప్రేక్షకులు, నెటిజన్లు
- అతడు భారతీయ బాలుడని తాజాగా వెల్లడించిన ముజీబ్
ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ ఘనవిజయం సాధించాక ఓ బాలుడు సంతోషం తట్టుకోలేక స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్‌ను కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదంతా చూసిన నెటిజన్లు ఆ బాలుడు ఆఫ్ఘన్ కుర్రాడేనని భావించారు. ఇంగ్లండ్‌పై విజయం సాధించాక బాలుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని అనుకున్నారు. కానీ ఆ బాలుడిది భారత్ అని తాజాగా ముజీబ్ చెప్పాడు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించాడు.
‘‘ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ గెలిచిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న బాలుడిది మా దేశం కాదు. అతడు భారత్ కుర్రాడే. క్రికెట్ అంటే కేవలం ఆట కాదు భావోద్వేగమని ఈ చిన్నారి తెలియజేశాడు’’ అని ముజీబ్ తెలిపాడు. కాగా, తనను చూసి కన్నీటిపర్యంతమైన చిన్నారిని ముజీబ్ ఓదార్చాడు. అతడి చేత మంచినీళ్లు తాగించి, ఓ చాక్లెట్ ఇచ్చాడు.