Celina Jaitly: సుప్రీంకోర్టు తీర్పు నిరాశను కలిగించింది: సెలీనా జైట్లీ
- వివాహం చేసుకుని, కుటుంబం కలిగి ఉండడం మనుషుల హక్కుగా పేర్కొన్న నటి
- పార్లమెంట్ దీనిపై చట్టం తెస్తుందన్న ఆశాభావం
- సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భూమిపెడ్నేకర్
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల నిరాశను వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం తెలిసిందే. దీనిపై నిర్ణయాన్ని పార్లమెంటు అభీష్టానికే విడిచి పెట్టింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పును సెలీనా ఖండించింది.
‘‘వివాహంపై తీర్పు నిజంగా నిరాశను కలిగించింది. ఎల్ జీబీటీ కమ్యూనిటీ భిన్నమైన హక్కులను ఏమీ కోరడం లేదు. ప్రతీ ఒక్క భారత పౌరుడికి ఉన్న హక్కులనే వారు కూడా కోరుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఎల్ జీబీటీ కార్యకర్తగా ఉన్న నేను ఇది చెప్పదలుచుకున్నాను. వివాహం చేసుకోవడం, కుటుంబాన్ని కలిగి ఉండడం అన్నది మనిషికి ఉండాల్సిన చాలా ముఖ్యమైన హక్కు. దీనిపై పార్లమెంట్ అయినా ప్రత్యేక వివాహ చట్టం తీసుకొస్తుందని, లింగ సమానత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాను’’ అని సెలీనా జైట్లీ తెలిపారు.