Neck Pain: నిద్రలో మెడ పట్టేసిందా.. ఇలా చేసి చూడండి!
- వేడి నీటితో కాపడం పెడితే నొప్పి నుంచి ఉపశమనం
- తేలికపాటి వ్యాయామంతోనూ ప్రయోజనం కనిపిస్తుందట
- మరీ ఎత్తైన దిండును వాడవద్దంటున్న నిపుణులు
ఉదయాన్నే మెడ నొప్పితో నిద్ర లేవడం బాధాకరమైన అనుభవమే.. నిద్రలో మెడ పట్టేయడం వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. మెడను తిప్పడం సాధ్యం కాదు. ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు దాదాపుగా అందరికీ అనుభవమే.. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్య నిపుణులు పలు చిట్కాలు సూచిస్తున్నారు. మెడ పట్టేయడం, నొప్పికి ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిద్రించేటపుడు ఉపయోగించే దిండే కారణమని చెబుతున్నారు. గొంతులో వాపు వల్ల కూడా మెడ దగ్గర నొప్పి కలుగుతుందని వివరించారు.
- మార్కెట్లో దొరికే హాట్ వాటర్ బ్యాగ్ ను మెడ చుట్టూ ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
- మెడ నొప్పితో బాధపడుతున్నపుడు పుష్కలంగా నీరు తాగటం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని అంటున్నారు.
- మరీ ఎత్తుగా ఉండే దిండును వాడుతుంటే వెంటనే దానిని దూరం పెట్టాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. దిండు మరీ ఎత్తుగా ఉంటే దీర్ఘకాలంలో మెడ నొప్పికి కారణమవుతుందని చెబుతున్నారు. మెడ నొప్పితో బాధపడుతున్నపుడు దిండు లేకుండా నిద్రించాలని చెప్పారు.
- నొప్పిగా ఉన్న చోట ఐస్ ప్యాక్ పెట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.. వాపును కూడా తగ్గిస్తుంది.
- మెడ నొప్పి రోజుల తరబడి వేధిస్తుంటే 20 నిమిషాల పాటు వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల గుణం కనిపిస్తుంది.
- తేలికపాటి వ్యాయామాలు, యోగా, నడక వంటివి చేయడం వల్ల మెడకు రక్తప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.