World Cup: టాస్ గెలిచి న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆఫ్ఘనిస్థాన్
- వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ తో ఆఫ్ఘన్ ఢీ
- చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
వరల్డ్ కప్ లో ఇప్పుడు చిన్న జట్లను తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మొన్న ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్థాన్... నిన్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తుగా ఓడించాయి. ఈ నేపథ్యంలో, టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టు నేడు ఆఫ్ఘనిస్థాన్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 37 పరుగులు. ఓపెనర్ విల్ యంగ్ (17 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో జట్టుకు దూరమవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్ మరోసారి జట్టు పగ్గాలు అందుకున్నాడు.