KCR: అనేకమందిని బలితీసుకున్నారు... నేనూ చావునోట్లో తలపెడితేనే తెలంగాణ వచ్చింది: కేసీఆర్
- ఉద్యమం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు హేళనగా మాట్లాడారన్న కేసీఆర్
- కాంగ్రెస్ ఉద్యమంలో కలిసి రాలేదని ఆరోపణ
- యాభై ఏళ్ల పాటు తెలంగాణను ఇబ్బంది పెట్టింది ఎవరో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదని, చావునోట్లో తలకాయ పెడితే తప్ప రాష్ట్రం రాలేదని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలేదన్నారు.
ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు హేళనగా మాట్లాడేవారని అన్నారు. తెలంగాణ వచ్చేదా... సచ్చేదా అనేవారన్నారు. కానీ ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తనపై ఎన్నో నిందలు వేశారన్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల వారు తనతో కలిసి ఉద్యమంలో కలిసి రాలేదన్నారు. వాటన్నింటిని దాటుకొని తెలంగాణ సాధించుకున్నామన్నారు.
సమైక్య పాలనలో చాలా దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని నాడు ఉద్యమం సమయంలో నాటి ముఖ్యమంత్రి అన్నారని ధ్వజమెత్తారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు కనీసం మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చామన్నారు. యాభై అరవై ఏళ్ల పాటు తెలంగాణను ఇబ్బంది పెట్టింది ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు.