Garuda Seva: రేపు తిరుమలలో గరుడ సేవ... టీటీడీ విస్తృత ఏర్పాట్లు
- తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్న దసరా బ్రహ్మోత్సవాలు
- ఈ సాయంత్రం స్వామివారికి సర్వ భూపాల వాహన సేవ
- రేపు గరుడ సేవకు లక్షలాదిగా తరలివస్తారన్న భూమన
- ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి
తిరుమల క్షేత్రం శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. ఈ సాయంత్రం స్వామివారికి సర్వ భూపాల వాహన సేవ నిర్వహించారు. రేపు ఎంతో ప్రశస్తమైన గరుడ సేవ జరగనుంది. స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.
గరుడ సేవ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. రేపటి గరుడ సేవకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన పేర్కొన్నారు. స్వామివారి సేవలో పాల్గొనడం అనేది జన్మజన్మల అదృష్టమని అన్నారు.
కాగా, తిరుమల క్షేత్రానికి వచ్చే వారు తమకు మెరుగైన రీతిలో మర్యాదలు జరగాలన్న కోరికతో వస్తే అది తప్పిదం అవుతుందని, మనమందరం దేవుని దాసులం అనే దృక్పథంతో కొండపైకి రావాలని సూచించారు. దేవుడి వద్ద మనం ముఖ్యమైన భక్తులం అనే భావనతో వస్తే జరిగేది నష్టమేనని అన్నారు. ఈ సందర్భంగా భూమన ధూర్జటి కవి రాసిన ఓ పద్యాన్ని కూడా వినిపించారు.