ODI World Cup 2023: ఎదుర్కొన్న తొలి బంతికే 14 పరుగులు.. బంగ్లాదేశ్ స్టార్ బౌలర్‌ను ఆడుకున్న విరాట్ కోహ్లీ!
- హసన్ మహమూద్‌కు చుక్కలు చూపించిన కోహ్లీ
- రెండు ఫ్రీ హిట్లు సమర్పించుకున్న హసన్
- ఫోర్, సిక్సర్ బాదిన కోహ్లీ
- ఆ ఓవర్లో వికెట్ తీసుకుని 23 పరుగులు ఇచ్చుకున్న హసన్
ప్రపంచకప్‌లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తంజీజ్ హసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా గమ్యం దిశగా పయనిస్తోంది.
కెప్టెన్ రోహిత్‌శర్మ 48 పరుగులు చేసి తొలి వికెట్‌గా అవుట్ కాగా, అర్ధ సెంచరీ (53) సాధించిన గిల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్న కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన బంగ్లా స్టార్ బౌలర్ హసన్ మహమూద్‌కు కోహ్లీ చుక్కలు చూపించాడు. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే 14 పరుగులు రాబట్టాడు. హసన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతిని ఆడిన రోహిత్ సింగిల్ తీశాడు. రెండో బంతిని ఎదుర్కొన్న గిల్ సింగిల్ తీశాడు. మూడో బంతికి రోహిత్ సిక్స్ బాదాడు. నాలుగో బంతికి రోహిత్ అవుటయ్యాడు.
రోహిత్ అవుట్‌తో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. విరాట్ ఎదుర్కొన్న ఐదో బంతి నోబాల్ అయింది. మిడ్‌వికెట్ మీదుగా బంతిని తరలించడంతో రెండు పరుగులు వచ్చాయి. నోబాల్ కావడంతో మరో రన్ వచ్చింది. దీనికి ఫ్రీహిట్ రావడంతో తర్వాతి బంతిని కోహ్లీ ఫోర్ కొట్టాడు. అది కూడా నోబాల్ కావడంతో మళ్లీ ఫ్రీహిట్ వచ్చింది. ఆ తర్వాతి బంతిని లాగిపెట్టి కొడితే అది స్టాండ్స్‌లో పడింది. దీంతో మూడు బంతులకు 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కోహ్లీ సింగిల్ తీయడంతో మొత్తం 14 పరుగులు అతడి ఖాతాలో చేరాయి. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ 13 పరుగులు పిండుకున్నట్టు అయింది. మొత్తంగా ఆ ఓవర్లో హసన్ ఒక వికెట్ తీసుకుని 23 పరుగులు సమర్పించుకున్నాడు.