Team India: ఆందోళనలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్
- గత రాత్రి బంగ్లాపై మ్యాచ్‌లో పాండ్యాకు గాయం
- పాండ్యా గాయం అంత సీరియస్ కాదన్న రోహిత్
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకి తోడు ఇతర అంశాలు కూడా సానుకూలంగానే కలిసొస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే.. చక్కటి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఆరంభ మ్యాచ్‌కు ముందు డెంగ్యూ బారిన పడడంతో అందరినీ కలవరానికి గురిచేసింది. అయితే అతడు వేగంగా కోలుకొని పాకిస్థాన్ పై మ్యాచ్‌కి అందుబాటులోకి రావడం, బంగ్లాదేశ్‌పై అర్ధశతకంతో ఫామ్ అందుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే తాజాగా గురువారం రాత్రి బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం ఇటు టీమిండియా మేనేజ్‌మెంట్‌తోపాటు ఇండియన్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది. స్కానింగ్ కోసం పాండ్యాను హాస్పిటల్‌కు తరలించామని బీసీసీఐ ప్రకటించడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. బౌలింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో గాయం ఎంత పెద్దదో, తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడో, రాడోనని కంగారుపడ్డారు.
అయితే అందరికీ ఊరటకలిగిస్తూ పాండ్యా గాయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. పాండ్యా గాయం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదని స్పష్టం చేశాడు. అదంత సీరియస్ గాయం కాదని నిర్ధారించాడు. దీంతో హార్ధిక్ పాండ్యా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది.
ఇదిలావుండగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ పాండ్యా గాయపడ్డాడు. మ్యాచ్ 9వ ఓవర్లో 3 బంతులు వేశాక అతడి ఎడమ చీలమండకు గాయమైంది. దీంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. కాగా పాండ్యా ఓవర్లో మిగిలిన 3 బంతులను విరాట్ కోహ్లీ పూర్తి చేయడం విశేషం.