Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి
- హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జోబాబు
- 2002 అక్టోబర్ 23 నుంచి జైల్లోనే ఉంటున్న వైనం
- జైళ్ల శాఖ పెట్రోల్ బంకులో పని చేస్తున్న జోబాబు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ మృతి చెందాడు. మృతుడి పేరు జోబాబు. 55 ఏళ్ల జోబాబుది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామం. ఓ హత్య కేసులో అతనికి జీవిత ఖైదు పడింది. 2002 అక్టోబర్ 23వ తేదీ నుంచి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. గత నెల 28న హైబీపీ వచ్చి అతను పడిపోయాడు. అతనిని పరీక్షించిన జైలు ఆసుపత్రి వైద్యులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
జోబాబుకు పరీక్షలు నిర్వహించిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతను హెచ్టీఎన్, న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనంతరం జైలు అధికారులు అతనిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ అతను నిన్న చనిపోయారు. జోబాబు పక్షవాతంతో తమ ఆసుపత్రిలో చేరాడని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 2008 నుంచి జోబాబు ఓపెన్ జైల్లో ఉంటున్నాడు. జైళ్ల శాఖ పెట్రోల్ బంకులో పని చేసేవాడు.