TDP: ఇసుక పాలసీ పేరుతో జగన్ ప్రజలను దోచుకున్నారు: టీడీపీ నేత పట్టాభిరాం
- అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే దోపిడీ మొదలుపెట్టాడని ఆరోపణ
- ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ ఇసుక రూ.1300 లకు దొరికేదన్న పట్టాభిరాం
- కొత్త పాలసీ వచ్చాక ఏడెనిమిది వేలకు పెరిగిందని విమర్శ
ఇసుక పాలసీ పేరుతో ముఖ్యమంత్రి జగన్ దోపిడీకి పాల్పడ్డాడని టీడీపీ సీనియర్ నేత పటాభిరాం మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1200, రూ.1300 లకు దొరికేదని ఆయన గుర్తుచేశారు. ఈ విధానాన్ని రద్దు చేసి జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త విధానంతో అదే ట్రాక్టర్ ఇసుక రూ.7 వేలు, రూ.8 వేలకు చేరిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే జగన్ ఇసుక దోపిడీకి తెరతీశాడని విమర్శించారు. జిల్లాలవారీగా తన తాబేదారులను పెట్టుకుని దోచుకున్నాడని ఆరోపించారు.
జగన్ తాబేదారుల దోపిడీని తట్టుకోలేక జనం గగ్గోలు పెట్టడంతో పారదర్శక పాలసీ పేరుతో టెండర్లు పిలిచి జయప్రకాశ్ పార్వెంచర్స్ కంపెనీకి కట్టబెట్టారని పట్టాభిరాం చెప్పారు. అయితే, ఈ రోజుకూ ఎవరికీ కూడా జయప్రకాశ్ కంపెనీ నుంచి ఒరిజినల్ బిల్లులు రావట్లేదన్నారు. ఎక్కడా ఆన్ లైన్ పేమెంట్లు జరగవని, అన్నిచోట్లా నగదు చెల్లింపులే జరుగుతున్నాయని వివరించారు. ఇందులో ఇక పారదర్శకత ఎక్కడున్నట్లు అంటూ పట్టాభిరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.