Hardik Pandya: న్యూజిలాండ్ తో మ్యాచ్ కు పాండ్యా దూరం

Hardik Pandya likely to miss India vs New Zealand after twisting left ankle in Pune

  • బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా కాలి చీలమండకు గాయం
  • బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో పరీక్షించనున్న వైద్యులు
  • వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న సూచన

ప్రపంచకప్ 2023లో భారత్ కు అసలైన పరీక్ష ఎదురు కానుంది. ఈ టోర్నమెంట్ లో బలమైన జట్టుగా ఉన్న న్యూజిలాండ్ తో భారత్ వచ్చే ఆదివారం ధర్మశాల వేదికగా పోటీ పడనుంది. న్యూజిలాండ్, భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలతో టాప్-2లో ఉన్నాయి. బలమైన ఈ రెండు జట్ల ముఖాముఖి పోరుకు ముందు టీమిండియాలో కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గాయపడ్డాడు. ఈ మ్యాచ్ కు పాండ్యా దూరం కానున్నాడనేది తాజా సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భాగంగా పాండ్యా, బాల్ ను ఎడమ కాలుతో ఆపే ప్రయత్నంలో చీలమండకు గాయమైంది. పాండ్యా మొదటి ఓవర్ వేస్తున్నప్పుడే ఇది చోటు చేసుకుంది. దీంతో సపోర్ట్ స్టాఫ్ సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. స్కానింగ్ చేయగా, చీలమండ గాయం బయటపడింది. అదేమీ పెద్దది కాదని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నప్పటికీ, గాయం కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ దూరం కానున్నట్టు తెలుస్తోంది. పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి, అక్కడ ఇంగ్లండ్ స్పెషలిస్ట్ వైద్యుల సలహా తీసుకోనున్నాడు. పూణెలో వైద్యులు ప్రాథమికంగా పాండ్యాకు ఇంజెక్షన్లు ఇవ్వడంతోపాటు, వారం రోజులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఈ నెల 29న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ నాటికి పాండ్యా కోలుకోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News