Chandrababu: చంద్రబాబు లీగల్ ములాఖత్ ల పెంపునకు నో చెప్పిన ఏసీబీ కోర్టు

Chandrababu lawyers Petition Denied by ACB Court

  • రోజుకు మూడు ములాఖత్ లు ఇప్పించాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్
  • కనీసం 45 నుంచి 50 నిమిషాలు టైమ్ ఇప్పించాలని విజ్ఞప్తి
  • ప్రతివాదుల పేర్లు చేర్చలేదంటూ పిటిషన్ పై విచారణకు తిరస్కరించిన కోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ విషయంలో ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆయనను కలిసేందుకు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడు సార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని చెప్పారు. లీగల్ ములాఖత్ పై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News