- అత్యాచారాలపై భర్త వివాదాస్పద వ్యాఖ్యలు
- మహిళా ఉద్యోగుల గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు
- పదేళ్ల తమ బంధం ముగిసిందన్న ఇటలీ ప్రధాని
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపారు. కొంత కాలంగా తాము ప్రయాణిస్తున్న దారులు మారాయని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయిందని అన్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది.
భర్తతో మెలోని విడాకులు తీసుకోవడానికి కొన్ని నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. ఇటలీలో వెలుగు చూసిన సామూహిక అత్యాచారాల ఘటనలు కలకలం రేపాయి. దీనిపై మోలోని భర్త గియాంబ్రనో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారని... అత్యాచారాలను నివారించాలంటే మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలని చెప్పారు. అతిగా మద్యం సేవించకుండా ఉంటే... మీరు ఇబ్బందుల్లో పడరని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
దీనిపై ఆయన వివరణ ఇస్తూ... మద్యం కోసం, డ్రగ్స్ కోసం బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలనే తాను చెప్పానని అన్నారు. మరోవైపు మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన భర్తతో విడిపోతున్నట్టు ఇటలీ ప్రధాని తెలిపారు. మరోవైపు, ఇటలీకి తొలి మహిళా ప్రధాని మెలోనీ కావడం గమనార్హం.