World Cup: చెత్త షాట్లు కొట్టి చేజేతులా ఓడిన పాకిస్థాన్
- వరల్డ్ కప్ లో ఆసీస్ వర్సెస్ పాకిస్థాన్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు
- లక్ష్యఛేదనలో పాక్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్
- 4 వికెట్లతో సత్తా చాటిన ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా
భారీ షాట్లతో హోరెత్తిపోయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ జట్టు పరాజయం పాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేయగా... పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశలో పాక్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, చెత్త షాట్లు కొట్టిన ఆ జట్టు బ్యాట్స్ మెన్ చేజేతులా వికెట్లు అప్పగించారు. ముఖ్యంగా ఆడమ్ జంపా బౌలింగ్ ఏమంత ప్రమాదకరంగా లేనప్పటికీ, తప్పుడు షాట్ సెలక్షన్ తో పాక్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు.
ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (70), అబ్దుల్లా షఫీక్ (64) తొలి వికెట్ కు 21.1 ఓవర్లలో 134 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్ మెన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాక్ కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ బాబర్ అజామ్ (18) పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.
అయితే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్, సాద్ షకీల్ మధ్య ఓ మోస్తరు భాగస్వామ్యం నడిచింది. రిజ్వాన్ 46, షకీల్ 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అయితే ఆసీస్ కెప్టెన్ కమిన్స్... షకీల్ ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈ దశలో ఇఫ్తికార్ అహ్మద్ భారీ సిక్సులతో ఆసీస్ శిబిరంలో అలజడి రేపాడు. ఇఫ్తికార్ 20 బంతుల్లో 3 సిక్సులతో 26 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత పాక్ వికెట్లు వేగంగా పతనం అయ్యాయి.
ఆసీస్ బౌలర్లలో జంపా 4, కమిన్స్ 2, స్టొయినిస్ 2, స్టార్క్ 1, హేజెల్ వుడ్ 1 వికెట్ తీశారు. కొన్నిరోజుల కిందటి వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆస్ట్రేలియా ఈ విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ ఐదో స్థానానికి పడిపోయింది.
కాగా, రేపు శనివారం నాడు వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో శ్రీలంక, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ కు లక్నో ఆతిథ్యమిస్తోంది. ఇక, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది.