Bollywood: స్వర భాస్కర్ ఎమోషనల్ పోస్ట్.. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై తొలిసారి స్పందన
- గాజాలో ఆసుపత్రిపై బాంబు దాడిలో చిన్నారుల మరణాలపై ఆందోళన
- తన కూతురు గాజాలో జన్మించి ఉంటే ఎలా కాపాడుకోగలనంటూ ఆవేదన
- గాజాలోని చిన్నారులపై దయచూపాలని దేవుడికి ప్రార్థన
ఇటివలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఆమె స్పందించారు. ఇటీవల గాజాలోని ఓ ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిలో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు రాబియా ఒడిలో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ప్రశాంతంగా నిద్రపోతున్న తన కూతురి ముఖంవైపు చూస్తూ.. ఒకవేళ తాను గాజాలో పుట్టి ఉంటే ఆమెను ఎలా కాపాడుకోగలనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు తన కూతురికి ఎప్పటికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు.
గాజాలో ప్రతినిత్యం మృత్యువాతపడుతున్న పిల్లలు చేసిన పాపం ఏంటి? తన కూతురిమీద ఉన్న ఆశీర్వచనాలు ఏంటి? అని ఆశ్చర్యపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఆలకించి గాజాలోని పిల్లలను బాధలు, మరణాల నుంచి రక్షించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం వారిని రక్షించలేదని, అందుకే దేవుడిని వేడుకుంటున్నట్టు చెప్పారు.
ఏ మాతృమూర్తి అయినా తన నవజాత శిశువుతో గంటలు గంటల సమయం ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలనుకుంటుందని, ఇందుకు తానేమీ విభిన్నం కాదని అన్నారు. చేతిలో ఉన్న పసిప్రాణం వైపు చూసినప్పుడు తనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ ఇదే అనుభూతి కలుగుతుందని, కానీ ఇప్పుడు ఎంతమాత్రం విస్మరించలేని భయంకరమైన ఆలోచనల కారణంగా తామంతా గాయపడ్డామని స్వర భాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు.