Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం?.. ఖాతాదారుల్లో టెన్షన్
- ఫోన్ నెంబర్ మార్చి ఖాతాదారుల సొమ్ము కాజేసిన వైనం
- ఇంటి దొంగల పనేనని తేల్చిన ఆడిట్
- చర్యలకు సిద్ధమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగులే తమ ఖాతాదారుల సొమ్మును కాజేశారని సంస్థ జరిపిన ఇంటర్నల్ ఆడిట్ లో బయటపడింది. సిస్టంలోని లోపాన్ని అనుకూలంగా మార్చుకుని ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్ లలో ఈ తరహా మోసాలు చోటుచేసుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. విషయం తెలియడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలకు సిద్ధమైంది.
మోసం జరిగిందిలా..
ఫోన్ నెంబర్లు లేని ఖాతాలను గుర్తించి పలువురు ఉద్యోగులు తమ నెంబర్లతో అప్ డేట్ చేశారు. ఆపై ఆ నెంబర్ సాయంతో మొబైల్ యాప్ ద్వారా ఖాతాలోకి లాగిన్ అయ్యారు. ఖాతాలోని సొమ్మును వివిధ అకౌంట్లకు బదిలీ చేయడం, వస్తువుల కొనుగోలు చేయడం చేశారు. మొబైల్ నెంబర్ లేకపోవడంతో ఖాతాదారులకు ఈ మోసం గురించి తెలియడానికి చాలా రోజులే పట్టిందని పలు నివేదికలు బయటపెట్టాయి. అయితే, ఈ ఆరోపణలను బ్యాంక్ ఆఫ్ బరోడా తొలుత కొట్టిపారేసింది. అలా జరిగేందుకు అవకాశంలేదని స్పష్టం చేసింది.
ఆ తర్వాత వరుస ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాలతో నిర్వహించిన అంతర్గత ఆడిట్ లో స్కాం నిజమేనని తేలింది. దీనికి బాధ్యులైన 60 మంది ఉద్యోగులను గుర్తించి సస్పెండ్ చేసింది. విచారణ తర్వాత వారిని శాశ్వతంగా తొలగించే అవకాశం ఉందని సమాచారం. సస్పెన్షన్ వేటు వేసిన ఉద్యోగులు అంతా గుజరాత్ లోని వడోదర, భోపాల్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారేనని అధికారులు తెలిపారు.