Nawaz Shariff: నాలుగేళ్ల తర్వాత ఈరోజు స్వదేశానికి తిరిగి వస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు

Ex Pak PM Nawaz Sharif To Return Home Today

  • అవినీతి కేసులో షరీఫ్ ను 2017లో దోషిగా తేల్చిన కోర్టు
  • వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన షరీఫ్
  • అప్పటి నుంచి అక్కడే ఉంటున్న మాజీ ప్రధాని

పాకిస్థాన్ కు మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలను నిర్వహించిన నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత ఈరోజు సొంత దేశానికి వస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయిన షరీఫ్... ఎక్కువ కాలం లండన్ లో వున్నారు. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో ఉంటున్నారు. ఈరోజు దుబాయ్ నుంచి ఆయన ఇస్లామాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి లాహోర్ కు వెళ్తారు. లాహోర్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంఎల్-ఎన్) శ్రేణులు ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నాయి. విమానాశ్రయం నుంచి షరీఫ్ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

అవినీతి కేసులో 2017లో షరీఫ్ ను కోర్టు దోషిగా తేల్చింది. జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే శిక్ష కాలం ఏడాది కూడా పూర్తి కాకుండానే వైద్య చికిత్సల కోసం ఆయన లండన్ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన తిరిగి రాలేదు. పాక్ కు తిరిగి రావాలంటూ ఇమ్రాన్ ఖాన్ హయాంలో కోర్టులు ఆదేశించినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. తాజాగా ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News