World Cup: 150 కొడితే గొప్ప అనుకుంటే.... 262 కొట్టారు!

Nederlands scores 263 runs against Sri Lanka whrere the Dutch side lost six wickets for 91 runs

  • వరల్డ్ కప్ లో నేడు శ్రీలంకతో నెదర్లాండ్స్ ఢీ
  • లక్నోలో మ్యాచ్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
  • 49.4 ఓవర్లలో 262 ఆలౌట్
  • ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు డౌన్
  • అద్భుతంగా ఆడిన ఎంగెల్ బ్రెక్ట్, వాన్ బీక్

నెదర్లాండ్స్ అందరూ అనుకున్నంత చిన్న జట్టేమీ కాదు. ఇవాళ శ్రీలంకపై ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరే అందుకు నిదర్శనం. 91 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 150 కొడితే గొప్ప అనుకుంటే... ఇన్నింగ్స్ చివరికి 49.4 ఓవర్లలో 262 పరుగుల స్కోరు చేసింది. 

ఇవాళ లక్నోలో శ్రీలంక, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పేస్ కు, స్వింగ్ కు అనుకూలిస్తుండడంతో లంక సీమర్లు చెలరేగారు. దాంతో డచ్ టాపార్డర్ కుదుపులకు లోనైంది. 

ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (4), మాక్స్ ఓ డౌడ్ (16) విఫలం కాగా, వన్ డౌన్ లో వచ్చిన కోలిన్ అకెర్ మన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. బాస్ డీ లీడ్ (6), తేజ నిడమానూరు (9), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (16) క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. 

21.2 ఓవర్ల వద్ద నెదర్లాండ్స్ స్కోరు చూస్తే 6 వికెట్లకు 91 పరుగులు. మిగతా నాలుగు వికెట్లు పడడానికి ఇంకెంతో సేపు పట్టదనిపించింది. కానీ సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్, లోగాన్ వాన్ బీక్ అద్భుత బ్యాటింగ్ తో నెదర్లాండ్స్ కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. 

ఎంగెల్ బ్రెక్ట్ 82 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 70 పరుగులు చేయగా, వాన్ బీక్ 75 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 59 పరుగులు చేశాడు. ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నమోదు చేసి లంకపై పోరాడదగ్గ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 4, కసున్ రజిత 4, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు. 

నెదర్లాండ్స్ జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ ఫలితంపైనా అత్యంత ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News