Andhra Pradesh: పండుగ సీజన్ ముందు ఉల్లి ఘాటు.. పెరుగుతున్న ధరలు
- విశాఖలో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.50 పలుకుతున్న వైనం
- కర్ణాటక నుంచి సరఫరా తగ్గడమే ప్రధాన కారణం
- నవంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి కొత్త దిగుబడి
టమాటాల ధరలు అదుపులోకి వచ్చి సామాన్య జనాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వినియోగదారులకు షాకిచ్చేందుకు ఉల్లి సిద్ధమైంది. పండగ సీజన్ వేళ ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త తక్కువగా ఉన్న ఉల్లిపాయలు తాజాగా మార్కెట్లో కేజీ రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరోసారి పెరుగుతున్నాయని సామాన్య జనాలు లబోదిబోమంటున్నారు.
ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఉల్లి సరఫరా అవుతుంటుంది. అయితే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవ్వడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కొత్త దిగుబతి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోంది. విశాఖపట్నంలో కేజీ ఉల్లి రూ.50 పలుకుతోంది. ఇక రైతుబజార్లో రూ.40గా ఉంది.
కర్ణాటకలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తుండడం కూడా ఒక కారణంగా ఉంది. కాగా కొత్త ఉల్లి నవంబర్ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరల ఘాటును సామాన్యులు భరించడం తప్పేలా కనిపించడం లేదు.