Varun Tej: వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి ఇటలీలో సర్వం సిద్ధం... నేడు భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన మెగా ప్రిన్స్

Varun Tej Lavanya jet off to Tuscany for lavish wedding Upasana joins them
  • టుస్కానీలో నవంబర్ 1న వీరి వివాహం
  • వీరితోపాటు టుస్కానీ చేరుకున్న ఉపాసన కామినేని
  • పెళ్లి తర్వాత కొత్త జంట నెల రోజుల హనీమూన్
నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి అతి త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో ఉన్న బోర్గో శాన్ ఫెలైస్ రిసార్ట్ లో జరగనుంది.ఈ వేడుకకు వారం ముందే వరుణ్ తేజ్, లావణ్య టుస్కానీ బయల్దేరి వెళ్లిపోయారు. వరుణ్ తేజ్ విమానంలో విండో నుంచి తీసిన ఫొటోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. వీరికి తోడుగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. డబుల్ రెయిన్ బో (రెండు ఇంద్ర ధనస్సులు), టుస్కానీ అంటూ ఆమె ఒక ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

నవంబర్ 1న టుస్కానీలో జరిగే ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు ఇలా మెగా ఫ్యామిలీ తరఫున అన్ని కుటుంబాల వారు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. హాల్దీ, మెహెందీ, సంగీత్, వివాహం ఇలా నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలకు రంగం సిద్దం చేశారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలంటైన్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుంచే ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయింది. 

కాగా, లావణ్య త్రిపాఠితో తన పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన వరుణ్ తేజ్... 'ఆపరేషన్ వాలంటైన్' కోసం తిరిగి భారత్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ఆయన టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కోసం హైదరాబాదులో తెలుగు కామెంటరీ బృందంతో జత కలిశారు. పనిలో పనిగా 'ఆపరేషన్ వాలంటైన్' ప్రమోషన్ కూడా కానిచ్చేశారు.
Varun Tej
Lavanya
Tuscany
Italy
wedding
Upasana

More Telugu News