Asaduddin Owaisi: మోదీ ఇంకెప్పటికీ ప్రధాని కాకూడదు... అదే నా లక్ష్యం: ఒవైసీ
- రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు
- రాజస్థాన్ ఎన్నికల బరిలో దిగుతున్న ఎంఐఎం
- కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలో దింపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు.
"ప్రధాని మోదీని ఓడించాలన్నది మీ లక్ష్యం అయితే, మోదీ ఇక ఎప్పటికీ ప్రధాని కాకూడదన్నది నా లక్ష్యం. మీరెప్పుడైనా బీజేపీకి ఓటేశారా అని నేను మిమ్మల్ని అడిగితే, ఓటు వేయలేదని మీరు చెబితే... మరి ఇన్నాళ్ల పాటు బీజేపీ ఎలా గెలుస్తున్నట్టు? రాహుల్ గాంధీ ఓటర్లు, అశోక్ గెహ్లాట్ ఓటర్లు కూడా ప్రధాని మోదీని తమ హీరోగా పేర్కొంటారు. ఇప్పుడు మేం రాజస్థాన్ లో పోటీ చేయడానికి వచ్చే సరికి ఒవైసీ ఓట్లు చీల్చడానికి వచ్చాడు అంటున్నారు. ఒవైసీ రాకతో బీజేపీకి లబ్ది చేకూరుతుందని అంటున్నారు. వీళ్లందరినీ నేను ఒకటి అడగదలుచుకున్నా... మేం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. మరి ఇన్నాళ్లు బీజేపీ ఎవరి వల్ల గెలిచింది? 2019 ఎన్నికల్లో ఇక్కడి బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారు? కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పగలదా?" అంటూ రాజస్థాన్ అధికార పక్షంపై ఒవైసీ ధ్వజమెత్తారు.