Virat Kohli: విరాట్‌పై రోహిత్ శర్మ ప్రశంసలు..ఎన్నో ఏళ్లుగా ఇదే చేస్తున్నాడని కితాబు!
- వరల్డ్ కప్‌లో భారత్‌కు వరుసగా ఐదో విజయం
- న్యూజిలాండ్ కు తొలిసారిగా అపజయం రుచి చూపించిన టీమిండియా
- భారత్ విజయంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర
- గతంలో విరాట్ కీలక ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడని రోహిత్ శర్మ ప్రశంస
నిన్న ఉత్కంఠ భరింతగా జరిగిన న్యూజిలాండ్, ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ అభిమానులను ఎంతగానో అలరించింది. న్యూజిలాండ్ పై భారత్ పోరాడి గెలిచింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ, షమీ కీలక పాత్ర పోషించారు. 95 పరుగులతో విరాట్, 5 వికెట్లతో షమీ న్యూజిలాండ్ దూకుడుకు బ్రేకులు వేశారు.
మ్యాచ్ అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ టోర్నమెంట్‌ను మేం అద్భుతంగా ప్రారంభించాం. అయితే, చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. ఇక విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? క్లిష్ట సమయాల్లో జట్టుకు విరాట్ అనేక సార్లు అండగా నిలిచాడు. అతడికి కష్టకాలంలో పోరాడగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. మ్యాచ్ చివర్లో టీమిండియాపై కొంత ఒత్తిడి నెలకొన్నా కోహ్లీ, జడేజా పని పూర్తి చేశారు. ఈ టోర్నమెంట్లో షమీ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. పిచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు ఓ దశలో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఈ విజయంలో బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. శుభ్‌మన్, నేను గొప్ప స్కోర్ చేయకపోయినప్పటికీ మేం గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.