Gautami Tadimalla: బీజేపీకి నటి గౌతమి గుడ్‌బై.. పార్టీ సీనియర్లపై తీవ్ర ఆరోపణలు
- పార్టీ నుంచి తనకు మద్దతు కరవైందని గౌతమి ఆవేదన
- తనను మోసం చేసిన అళగప్పన్‌కు సీనియర్లు సాయం చేస్తున్నారని ఆరోపణ
- బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడి
- అళగప్పన్‌పై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
సీనియర్ సినీ నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి టాటా చెప్పేశారు. పార్టీ నుంచి తనకు మద్దతు కరవైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. గౌతమి నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. తన ఆస్తులను స్వాహా చేసిన సి. అళగప్పన్ అనే వ్యక్తికి పార్టీలోని సీనియర్ సభ్యులు పూర్తి మద్దతు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత 25 ఏళ్లు బీజేపీలో కొనసాగుతున్నానని, పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని గుర్తు చేశారు.
20 ఏళ్ల క్రితం అళగప్పన్ తనకు పరిచయమయ్యాడని, అతడిని నమ్మి తన ఆస్తుల నిర్వహణను అప్పగించినట్టు తెలిపారు. అతడికి తాను తన భూముల విక్రయ బాధ్యతలు అప్పగించానని, ఈ క్రమంలో అతడు తనను మోసం చేసినట్టు ఇటీవలే గుర్తించినట్టు చెప్పారు. అతడి కుటుంబంలో భాగమైన తనను, తన కుమార్తెను స్వాగతిస్తున్నట్టు నటిస్తూనే ఈ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నా పార్టీ నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని, పైపెచ్చు పార్టీలోని సీనియర్లు అళగప్పన్‌కు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత గత 40 రోజులుగా అళగప్పన్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి పరారీకి బీజేపీలోని సీనియర్ సభ్యులు సహకరిస్తున్న విషయం తెలిసి విస్తుపోయానన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, పోలీసులు, న్యాయవ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నట్టు గౌతమి తెలిపారు.
బీజేపీకి తాను బాధాతప్త హృదయంతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్‌గా, ఒంటరి మహిళగా తన కోసం, తన కుమార్తె భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తానని గౌతమి తెలిపారు.