World Cup: వరల్డ్ కప్ లో నేడు ఆసియా జట్ల పోరు... టాస్ గెలిచిన పాకిస్థాన్
- పాకిస్థాన్ తో ఆఫ్ఘనిస్థాన్ ఢీ
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ఉత్సాహభరితంగా సాగుతోంది. అటు బ్యాట్స్ మెన్, ఇటు బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ లతో మ్యాచ్ లు రసవత్తరంగా మారుతున్నాయి. వరల్డ్ కప్ లో ఇవాళ ఆసియా జట్లు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు ఒక మార్పు చేసింది. జ్వరంతో బాధపడుతున్న మహ్మద్ నవాజ్ ను జట్టు నుంచి తప్పించింది. సీనియర్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ జట్టులోకి పునరాగమనం చేశాడు. అటు, ఆఫ్ఘనిస్థాన్ జట్టులోనూ ఒక మార్పు జరిగింది. లెఫ్టార్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు.
టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్ 4 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ 4 మ్యాచ్ లు ఆడి 1 విజయం నమోదు చేసింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్ జట్టు వన్డేల్లో ఇప్పటివరకు పాకిస్థాన్ పై నెగ్గలేదు. మరి ఈ మ్యాచ్ తో ఆ రికార్డును సవరిస్తుందా? అనేది చూడాలి.