Team India: భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
- 77 ఏళ్ల వయసులో కన్నుమూత
- 67 టెస్టుల్లో 266 వికెట్లు సాధించిన దిగ్గజం
- స్పిన్ బౌలింగ్ విప్లవానికి బాటలు వేసిన మాజీల్లో ఒకరిగా గుర్తింపు
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ సోమవారం కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన బిషన్ సింగ్ బేడీ భారతీయ క్రికెట్‌లో ఒక సంచలనం. సెప్టెంబరు 25, 1946న అమృత్‌సర్‌లో ఆయన జన్మించారు. 1966లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించారు. బ్యాట్స్‌మెన్స్‌ను బోల్తా కొట్టించడానికి వైవిధ్యమైన బంతులు సంధించడంలో ఆయన చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. 1967-79 మధ్యకాలంలో భారత్ తరపున 67 టెస్టు మ్యాచులు ఆడి ఏకంగా 266 వికెట్లు తీశారు. అయితే వన్డేల్లో కేవలం 10 మ్యాచులు మాత్రమే ఆడి 7 వికెట్లు పడగొట్టారు. అంతేకాదు 22 మ్యాచ్‌ల్లో టీమిండియా పగ్గాలు చేపట్టాడు. భారత స్పిన్ బౌలింగ్ విప్లవానికి బాటలు వేసినవారిలో బిషన్ సింగ్ ఒకరు.
వన్డేల్లో భారత్ సాధించిన మొట్టమొదటి విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్‌లతోపాటు బిషన్ సింగ్ బేడీ కీలక పాత్ర పోషించారు. 1975 వరల్డ్ కప్‌లో ఈస్ట్ ఆఫ్రికాపై మ్యాచ్‌లో బేడీ అద్భుతంగా రాణించారు. ఈస్ట్ ఆఫ్రికా 120 పరుగులు చేయగా అందులో బేడీ గణాంకాలు 12-8-6-1 నమోదు చేశారు. ఇక దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే బిషన్ బేడీ ఢిల్లీ జట్టుకు ఎక్కువగా ఆడారు. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం రాణిస్తున్న క్రికెటర్లలో చాలామంది ఆయన వద్ద కోచింగ్ తీసుకున్నారు. పలువురు క్రికెటర్లకు ఆయన మెంటార్‌గా వ్యవహరించారు. క్రికెట్ ఫీల్డ్‌కు దూరమయ్యాక వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కూడా పనిచేశారు.