Pawan Kalyan: వైసీపీ అనే తెగులుకు జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్: పవన్ కల్యాణ్
- రాజమండ్రిలో జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
- దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశం
- సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్
- ఏపీ అస్థిరతకు గురైందని వెల్లడి
- మేమున్నాం అని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సమావేశమైనట్టు వెల్లడి
రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. హోటల్ మంజీరాలో దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కీలక భేటీ ముగిశాక పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆంధ్రాకు వస్తున్న తనను బోర్డర్ వద్ద అడ్డుకోవడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వం, వీరి పాలన విధానం, పాలసీ టెర్రరిజం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా మారాయని అన్నారు. సీపీఎం, సీపీఐ, బీజేపీ నేతల నుంచి ప్రతి పార్టీ వారిపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వివరించారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు వరకు ఈ అరాచకాలకు బాధితులయ్యారని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత ఇవ్వాలి, ఓట్లు చీలిపోకూడదు అని భావించినట్టు తెలిపారు.
"2014లో టీడీపీకి మేం మద్దతివ్వడానికి కారణం... కొత్త రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నేత అవసరం అని భావించాం. మేం వైసీపీకి, వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకం కాదు... వారి విధానాలనే మేం వ్యతిరేకిస్తున్నాం... వారి దోపిడీలకు, వారి దారుణాలకు మేం వ్యతిరేకం. అక్రమ కేసులతో జైలుకు పంపడం, మాట్లాడితే చాలు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, మాటలతో అయోమయానికి గురిచేయడం, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం, మద్యంపైనా, ఇసుకపైనా సంపాదించడం, మైనింగ్ దోపిడీ, ప్రత్యర్థులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ నిలబెట్టుకోలేకపోవడం... ఇలాంటి చర్యలకు మేం వ్యతిరేకం.
రాష్ట్రానికి పట్టిన వైసీపీ అనే తెగులు పోవాలంటే జనసేన-టీడీపీ అనే వ్యాక్సినే దీనికి సరైన విరుగుడు. అందులో భాగంగానే, రాజమహేంద్రవరంలో పొత్తుకు సంబంధించి చారిత్రాత్మక రీతిలో తొలి సమావేశం జరిగింది. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ నేతను రాజమండ్రి జైల్లో పెట్టి నానా హింసలకు గురిచేస్తున్నారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేయడం బాధాకరం.
మొన్నామధ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల కుర్రాడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. దారుణాలు చేసిన అందరికీ బెయిల్ వస్తోంది... కానీ అకారణంగా జైలుపాలైన వ్యక్తికి మాత్రం సాంకేతిక కారణాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రాకుండా చేస్తోంది. దీనికి ఒక్కటే పరిష్కారం... వైసీపీ ప్రభుత్వం పోవాలి... జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.
అన్యాయంగా జైలుకు వెళ్లిన చంద్రబాబుకు మానసికంగా మద్దతు ఇవ్వడానికే నేటి ఈ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించాం. ఈ హోటల్ కు కూతవేటు దూరంలో ఉన్న జైలులో ఉన్న చంద్రబాబుకు ధైర్యం ఇచ్చేలా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. టీడీపీ శ్రేణులకు మనోబలం ఇచ్చేలా, రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదేంటి అనే పరిస్థితుల్లోంచి... మేం కలిసికట్టుగా ఉన్నాం, రాష్ట్ర భవిష్యత్ ను చాలా బలంగా ముందుకు తీసుకెళతాం, వైసీపీ దోపిడీని అరికడతాం అనే భరోసా, సందేశం ఇవ్వడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.
ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. జనసేన, టీడీపీ కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మాట్లాడుకున్నాం. ఎన్నికలకు మరో 150 రోజుల సమయం కూడా లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై ఆలోచనలు పంచుకున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి... ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు జనసేన మేనిఫెస్టోలోని అంశాలు ఎలా జత చేయాలి అనేది చర్చించాం. దాదాపు 3 గంటల పాటు చర్చించాం" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.