G. Kishan Reddy: కాళేశ్వరం భద్రత పరిశీలనకు రేపు తెలంగాణకు కేంద్రబృందం: కిషన్ రెడ్డి
- మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో డ్యాం భద్రతపై కిషన్ రెడ్డి ఆందోళన
- బ్యారేజ్ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపించాలని కేంద్రమంత్రికి లేఖ
- ఆరుగురు సభ్యుల కమిటీతో కూడిన బృందం రాక
కాళేశ్వరం భద్రతను పరిశీలించేందుకు రేపు తెలంగాణకు కేంద్ర బృందం రానున్నట్లు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యారేజ్ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు తాను నిన్న లేఖ రాశానని తెలిపారు.
ఈ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారని వెల్లడించారు. ఆరుగురు సభ్యుల కమిటీతో కూడిన ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రేపు కాళేశ్వరం డ్యామ్‌ను సందర్శించనుందని తెలిపారు. కిషన్ రెడ్డి ఇటీవల కేంద్రజల వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ అథారిటీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.