Ambati Rambabu: చంద్రబాబు విషయంలో ఇంతగా బాధపడుతున్న పవన్‌కు ముద్రగడ విషయంలో బాధ అనిపించలేదా?: అంబటి రాంబాబు
- జనసేనానికి వ్యవస్థలపై అవగాహన లేదన్న మంత్రి అంబటి
- కేసు బలంగా ఉంది కాబట్టి బెయిల్ రావడం లేదన్న అంబటి రాంబాబు
- పవన్ కల్యాణ్‌కు ఒక విధానం, ఆలోచనంటూ లేవని విమర్శ
- టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అని చురకలు
- కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో లోకేశ్ మాటల్లోని డొల్లతనం బయటపడిందని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ విధానమంటూ లేదని అందుకే ఆయనను ప్యాకేజీ స్టార్ అని పిలుస్తామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ ఏం చేసినా చంద్రబాబు కోసమే చేస్తారన్నారు. చంద్రబాబుకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు, లోకేశ్ పల్లకిని మోసేందుకు పవన్ సిద్ధమవుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి వస్తారని తాము ముందు నుండీ చెబుతున్నామని, ఇప్పుడు అదే నిజమైందన్నారు.
2014లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయని, 2019లో చంద్రబాబు కోసం వేరుగా పోటీ చేశారని, 2024లో మళ్లీ కలిసి వస్తున్నారన్నారు. ఏం చేసినా చంద్రబాబు కోసమే పవన్ ఆలోచన అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి వచ్చినా, వేర్వేరుగా వచ్చిన తమకు వచ్చిన నష్టం లేదన్నారు. చంద్రబాబు విషయంలో ఇంతగా బాధపడుతున్న పవన్‌కు ముద్రగడ విషయంలో బాధ అనిపించలేదా? అని నిలదీశారు. ఆయనకు సొంత ఆలోచన లేదన్నారు. టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అన్నారు. వారిద్దరు కలిసేది రాష్ట్రం కోసం కాదని, టీడీపీని కాపాడటం కోసమన్నారు. జైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజల గుండెల్లో ఉండలేరన్నారు. టీడీపీ అంటే తెలుగు రాష్ట్రానికి తెగులు అన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రాకుండా తాము చేస్తున్నామని పవన్ ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు వ్యవస్థలపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసు బలంగా ఉంది కాబట్టి, పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ రావడం లేదన్నారు. మరో రెండు మూడు కేసులూ ఉన్నాయన్నారు. చంద్రబాబు దొరికిన దొంగ అని, రాష్ట్ర ఖజానాను దోచుకున్నారన్నారు.
కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో పురందేశ్వరి, లోకేశ్ మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. అమిత్ షా తనను పిలిపించుకున్నారని లోకేశ్ చెప్పారని, కానీ అది అవాస్తవమన్నారు. అమిత్ షా కోసం ఢిల్లీలో పడిగాపులు కాశారన్నారు.