Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించలేరు: వసీమ్ అక్రమ్
- వరల్డ్ కప్ లో వరుసగా 5 విజయాలు సాధించిన భారత్
- ధర్మశాలలో న్యూజిలాండ్ పై విజయంలో షమీ కీలకపాత్ర
- ఈ వరల్డ్ కప్ లో బరిలో దిగిన తొలి మ్యాచ్ లోనే షమీకి 5 వికెట్లు
- ఈ ఘనత టీమిండియా మేనేజ్ మెంట్ కు దక్కుతుందన్న అక్రమ్
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమన్నది లేకుండా జైత్రయాత్ర సాగిస్తుండడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించారు. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమైనప్పటికీ, టీమిండియాపై ఆ ప్రభావం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా లేకపోయినా టీమిండియా బలంగానే కనిపిస్తోందని అన్నారు. పాండ్యా కోలుకుని జట్టులోకి వస్తే టీమిండియా ఇంకెంత బలంగా ఉంటుందో చూసుకోండి అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ నెల 29న ఇంగ్లండ్ తో జరిగే పోరుకు పాండ్యాకు విశ్రాంతినిస్తేనే బాగుంటుందని అక్రమ్ అభిప్రాయపడ్డారు. అతడు కోలుకోకుండా హడావిడిగా బరిలో దించడం సరికాదని సూచించారు.
కండరాల గాయాలు విశ్రాంతి తీసుకుంటే తగ్గినట్టే కనిపిస్తాయని, కానీ మైదానంలోకి దిగాక గాయం బయటపడుతుందని వివరించారు. నూటికి నూరు శాతం కోలుకున్నాకే పాండ్యాను ఆడించాలని సలహా ఇచ్చారు.
న్యూజిలాండ్ పై అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన మహ్మద్ షమీని టీమిండియా ఇక ఎంతమాత్రం పక్కనబెట్టలేదని పేర్కొన్నారు. గత నాలుగు మ్యాచ్ ల్లో ఆడని షమీ... ఒక్కసారిగా బరిలో దిగినా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయి రాణించడం వెనుక టీమిండియా మేనేజ్ మెంట్ కృషి ఉందని అక్రమ్ కొనియాడారు.
రిజర్వ్ బెంచ్ పై ఉన్న ఆటగాళ్లను కూడా మ్యాచ్ కు సన్నద్ధంగా ఉంచిన ఘనత టీమిండియా మేనేజ్ మెంట్ కే దక్కుతుందని పేర్కొన్నారు. అందుకు షమీనే ఉదాహరణ అని వివరించారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో షమీ అద్భుతమైన రీతిలో రివర్స్ స్వింగ్ చేశాడని కితాబునిచ్చారు.