BRS: ఆ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఇంకా వీడని సస్పెన్స్!
- చాలాముందే దాదాపు అభ్యర్థులందర్నీ ప్రకటించిన కేసీఆర్
- మూడు నాలుగు స్థానాల్లో ఇప్పటికీ తేలని ఉత్కంఠ
- గోషామహల్, నర్సాపూర్, నాంపల్లి అభ్యర్థులు తేలని వైనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకు వెళ్తోంది. కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సగం మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా వెళ్తున్నప్పటికీ మరో మూడు నాలుగు సీట్లలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల్లో అగస్ట్ 15నే బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇప్పటికీ నాలుగుచోట్ల ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తొలుత జనగాం, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కొన్నిరోజుల క్రితం జనగాంకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. అయితే మల్కాజిగిరికి మైనంపల్లి హన్మంతరావును ప్రకటించినప్పటికీ ఆయన అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని బరిలోకి దింపనున్నారు.
అయితే నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల అభ్యర్థులపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాంపల్లిలో మజ్లిస్ పార్టీకి నష్టం కలిగించని అభ్యర్థి కోసం చూస్తున్నారు. నర్సాపూర్, గోషామహల్ నుంచి పలువురు రేసులో ఉన్నారు. నర్సాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆశావహులుగా ఉన్నారు. గోషామహల్ నుంచీ పలువురు ఆశావహులు ఉన్నారు. దీంతో పోటాపోటీ నెలకొంది. అలంపూర్ నియోజకవర్గం నుంచి అబ్రహంకు టిక్కెట్ ఇచ్చినప్పటికీ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.