Congress: తనిఖీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయకండి: కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత లేఖ
- ఎన్నికలకు సంబంధంలేని డబ్బును, బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని వెల్లడి
- సామాన్యులు తమ డబ్బు, బంగారం కోసం 50 రోజులు వేచి చూడాల్సి వస్తోందన్న కాంగ్రెస్ నేత
- అది ఎన్నికల కోసం ఉద్దేశించిందా? లేక వ్యక్తిగతమా? అన్నది నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి
ఎన్నికల నియమావళి కారణంగా తనిఖీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. తనిఖీల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోన్న తీరు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేని డబ్బును, బంగారాన్ని ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకుంటోందని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
షెడ్యూల్ ప్రకటన, పోలింగ్ తేదీ మధ్య 50 రోజుల గడువు ఉండగా వాహనాల తనిఖీల్లో ఎన్నికలకు సంబంధం లేని నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని, ఇది ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశ్యంగా తాము భావిస్తున్నామన్నారు. నగదు లేదా బంగారం సీజ్ చేయడానికి ముందు అది ఎన్నికల కోసం ఉద్దేశించిందా? లేక వ్యక్తిగతమా? అన్నది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
2018లోనూ ఇలాగే స్వాధీనం చేసుకున్న సొమ్ములో 90 శాతం తిరిగి ఇచ్చినట్లు తాను మీడియాలో చూశానన్నారు. అంటే సామాన్యులు తమ వ్యక్తిగత నగదు, బంగారం కోసం యాభై రోజులు వేచి చూడవలసి వస్తోందన్నారు. వ్యాపార ప్రాంతాలు, మద్యం దుకాణాలు, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తనిఖీలు నిర్వహించి డబ్బులు సీజ్ చేసి ఆ తర్వాత వాటిని ఎక్కడో దొరికినట్లు రసీదులు ఇస్తున్నారని ఆరోపించారు.