Israel: ఇజ్రాయెల్ దాడులతో రాత్రికి రాత్రే 700 మంది పాలస్తీనియన్ల మృతి.. ప్రకటించిన గాజా
- దాడులు మొదలయ్యాక రోజువారి గరిష్ఠ మరణాలు
- మంగళవారం రాత్రి భారీ దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
- డజన్ల కొద్ది ఉగ్రవాదులను హతమార్చామని ప్రకటన
ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజా వణికిపోతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో ఒక్క రోజే ఏకంగా 700 మంది మృత్యువాతపడ్డారు. హమాస్ వైద్యవిభాగం ఈ మేరకు ప్రకటన చేసింది. రెండు వారాలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ రోజువారీగా చూస్తే మంగళవారం నమోదయిన మరణాలే అత్యధికమని వెల్లడించింది. దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, సాయం అందాల్సిన ఆవశ్యకత ఉందని హమాస్ విచారం వ్యక్తం చేసింది.
మొత్తం 400 హమాస్ లక్ష్యాలపై దాడులు చేశామని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అయితే ఈ ఇస్లామిక్ గ్రూప్‌ను తుద ముట్టించడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మానవ సంక్షోభం ఏర్పడుతోందని అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తన మద్ధతు ప్రకటించేందుకు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు.