Cricket: పాక్ కెప్టెన్‌గా బాబర్ తొలగింపు?.. పాకిస్థాన్ జట్టులో కీలక పరిణామం
- ఆప్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత ఆసక్తికర పరిణామం
- పాక్ మాజీలతో పీసీబీ చీఫ్ అష్రఫ్ భేటీ
- పాక్ భవిష్యత్, కెప్టెన్సీపై చర్చ
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా అందులో రెండు విజయాలు మాత్రమే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌పై ఓటమి పాలయ్యాక బాబర్ నాయకత్వంలోని ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంటుండడంతో అటు స్వదేశంతోపాటు క్రికెట్ విశ్లేషకులు సైతం పాక్ ఆటగాళ్ల ప్రదర్శనను ఎండగడుతున్నారు. బాబర్ అజామ్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కెప్టెన్‌గా తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌ను ముందుకు తీసుకెళ్లడంపై ఆ దేశ మాజీలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ జకా అష్రఫ్ మంగళవారం సమావేశమయ్యారు. బాబర్ నాయకత్వంపై మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా బాబర్‌ను కెప్టెన్‌గా తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ చేరినా బాబర్ కెప్టెన్సీపై వేటుపడడం ఖాయమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఆఫ్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత మునుపెన్నడూ చూడని విమర్శలు వస్తుండడంతో బాబర్‌కు ఈ అనూహ్య పరిస్థితి ఎదురవుతోంది. పీసీబీ చీఫ్‌ని కలిసినవారిలో పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్-ఉల్-హక్, మహ్మద్ యూసుఫ్‌లతోపాటు పలువురు ఉన్నారు.
ఆ దేశ మాజీ దిగ్గజం, బౌలర్ ఆకిబ్ జావేద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పీసీబీ చీఫ్ సమావేశమైన మాజీల్లో ఒకరిగా ఉన్న ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుకు షాహీన్ అత్యుత్తమ ఆటగాడని అన్నారు. వైట్-బాల్ ఫార్మాట్‌లో సమర్థుడైన కెప్టెన్‌గా తనను తాను బాబర్ నిరూపించుకోవడంలో విఫలమయ్యాడని జావేద్ వ్యాఖ్యానించాడు.