Nara Bhuvaneswari: నాన్నగారు మాకు చెప్పిందదే: నారా భువనేశ్వరి
- ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దన్నారని వెల్లడి
- తెలుగు జాతి ఉన్నతి కోసం పాటుపడాలని సూచించారన్న భువనేశ్వరి
- నిజం గెలవాలి యాత్రలో ఎన్టీఆర్ ను గుర్తుచేసుకున్న వైనం
ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దని, తెలుగు వారి ఉన్నతికి పాటుపడాలని తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బుధవారం నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు జాతి అభ్యున్నతికి ఎన్టీఆర్ తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ సత్య మార్గంలోనే నడవాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దారిమార్చుకోవద్దని చెప్పారని వివరించారు.
ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ తెలుగు జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారని భువనేశ్వరి వివరించారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టారని, 47 రోజులుగా బంధించి ఉంచారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అండగా నిలిచిన వారిని, ఆయన జైలు పాలవడం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు యాత్ర మొదలు పెట్టానని చెప్పారు. మద్దతుదారులను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలని భువనేశ్వరి ట్వీట్ చేశారు.