Rajasthan Elections: రాజస్థాన్ లో రాజకీయ ప్రత్యర్థులుగా భార్యాభర్తలు.. గెలిచేదెవరో!
- కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ కు సొంతింట్లోనే ప్రత్యర్థి
- దాంతా రామ్ గఢ్ బరిలో సింగ్ కు పోటీగా ఆయన భార్య
- జేజేపీ నుంచి బరిలోకి దిగుతున్న రీటా చౌదరి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దాంతా రామ్ గఢ్ నియోజకవర్గం ఎన్నికలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.. ఈ నియోజకవర్గంలో భార్యాభర్తలు బరిలో నిలవడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 25న రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. దాంతా రామ్ గఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ నే మరోమారు బరిలో దింపాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. అయితే, రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వీరేంద్ర సింగ్ భార్య రీటా చౌదరి ఈసారి పార్టీ టికెట్ ఆశించారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. అయినా ఉపయోగం లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) లో చేరి దాంతా రామ్ గఢ్ టికెట్ సంపాదించారు. దీంతో నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా సేవలందిస్తున్న రీటా చౌదరి గత ఎన్నికల్లోనే పార్టీ టికెట్ ఆశించారు. అయితే, సీనియర్ నేతలతో పాటు భర్త వీరేంద్ర సింగ్ సర్దిచెప్పడంతో మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, తన భర్త వీరేంద్ర సింగ్ విజయానికి పాటుపడ్డారు. పార్టీలో తన సేవలకు గుర్తింపుగా ఈసారి ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా వస్తుందని ఆశించిన రీటాకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడారు. జేజేపీ టికెట్ తో బరిలోకి దిగుతున్న రీటా ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. భర్తపైనే పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు జవాబుగా.. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తన భర్తకు టికెట్ కేటాయించలేదని రీటా వివరించారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చినా సరే తాను మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ స్పష్టం చేసింది. దీనిపై వీరేంద్ర సింగ్ స్పందిస్తూ.. దాంతా రామ్ గఢ్ లో ఈసారి పోటీ తనకు తన భార్యకు మధ్యేనని స్పష్టం చేశారు.