Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో చేరే విషయంపై రాజగోపాల్ రెడ్డి నాతో మాట్లాడలేదు!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- తన సోదరుడు తన చేరిక విషయం పార్టీ అధిష్ఠానంతో మాట్లాడారన్న వెంకటరెడ్డి
- కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని తాము గతంలోనే ప్రధానికి లేఖ రాశామన్న కాంగ్రెస్ నేత
- కాంగ్రెస్ 80 సీట్ల వరకు గెలుస్తుందని ధీమా
- పార్టీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి సిద్ధమన్న కోమటిరెడ్డి
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తన తమ్ముడు కాంగ్రెస్‌లో చేరే విషయంపై తనతో చర్చించలేదన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... తన సోదరుడి చేరిక విషయం తనతో మాట్లాడలేదని, తమ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడారన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని తాము గతంలోనే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశామన్నారు. రాహుల్ గాంధీ పేరు పలికే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. రాహుల్ కుటుంబానికి కనీసం ఇల్లు కూడా లేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎంత? అని ధ్వజమెత్తారు. పార్టీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీకి సిద్ధమన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 70 నుంచి 80 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని, సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తి చేస్తుందన్నారు. అది రేపు విడుదలవుతుందన్నారు. కేవలం ఆరు సీట్లలో మాత్రమే ఇబ్బందికర పరిస్థితి ఉందన్నారు. ఒక్క సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారన్నారు. మొత్తం 119 సీట్లకు రేపు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అలాగే పొత్తులపై ఈ రోజు సాయంత్రం స్పష్టత వస్తుందన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తోందన్నారు.