Gutha Sukender Reddy: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందన
- ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం లేదన్న గుత్తా
- విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
- కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా
తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. తాను పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోందని... ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్ కుంగిపోవడంపై ఆయన మాట్లాడుతూ... ప్రకృతి విపత్తుల, సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు కానీ, తన కుమారుడికి కానీ ఎంపీ టికెట్ వస్తే పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. పక్క పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.