Congress: మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తాం: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కాంగ్రెస్ నేతలు
- కుంగిన ప్రాజెక్టును పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు
- బ్యారేజ్ కుంగిపోవడంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో దర్యాఫ్తు జరపాలని డిమాండ్
- ఈసీని కలిసిన వారిలో జైరామ్ రమేశ్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి
కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈసీని కలిసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వున్నారు. ఇటీవల కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని వారు ఈసీని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ... బ్యారేజ్ కుంగిపోవడంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు.
ముగిసిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముగిసింది. బుధవారం ఢిల్లీలో ఐదు గంటల పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. వామపక్షాలతోనూ పొత్తుపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, మల్లు భట్టి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ త్వరలో మరో 40 నుంచి 50 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశముంది.