Nara Bhuvaneswari: చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారు: నారా భువనేశ్వరి
- తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం
- సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ప్రసంగం
- టీడీపీ అధినేతపై కేసుల్లో ఆధారాలు ఏవని ప్రభుత్వానికి ప్రశ్న
- ఈ పోరాటం కేవలం తనదే కాదని, ప్రజలందరిదీ అని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.
‘‘నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడకు రాలేదు. నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చాను. ఈ పోరాటం నాది మాత్రమే కాదు.. ప్రజలందరిదీ. యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నిత్యం ఆలోచించేవారు. సరైన రోడ్లు లేని ప్రాంతంలో రాళ్లూరప్పల మధ్య హైటెక్ సిటీ ఏంటని నిర్మాణ సమయంలో అందరూ హేళన చేశారు. అయినా పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేసి లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు’’ అని అన్నారు.
స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆధారాలు ఉన్నాయా? అని నారా భువనేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్ల పాటు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పుంగనూరులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా అధికార పార్టీ ఏమీ చేయలేకపోయిందని చెప్పారు. ‘‘ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే, టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటారు. కానీ చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆయన్ను ఏమీ చేయలేరు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారు. ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది’’ అని అన్నారు.
కాగా, ఈ రోజు ఉదయం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.