Kanuri Damodar Prasad: చంద్రబాబుకు తోడుగా మేమున్నాం: ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్
- తెలుగు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ‘చంద్రబాబు గారితో మనం’ కార్యక్రమం
- కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు, దర్శకులు
- చంద్రబాబు ప్రజలకు ఎంతో మేలు చేశారన్న దామోదర ప్రసాద్
- హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం ఇంతలా అభివృద్ధి చెందడానికి బాబే కారణమని వెల్లడి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా తామందరం ఉన్నామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్ అన్నారు. టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో తెలుగు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఏర్పాటు చేసిన ‘చంద్రబాబు గారితో మనం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ తమ కుటుంబం, నందమూరి తారకరామారావు కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. తమ తాతలు, ముత్తాతల కాలం నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. తనకు చంద్రబాబుతో కూడా వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని తాను భువనక్క అని అంటానంటూ తమ కుంటుబాల మధ్య సాన్నిహిత్యాన్ని వివరించారు.
చంద్రబాబు ఓ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారో అందరికీ తెలుసన్నారు. ‘‘1995లో హైదరాబాద్ శివార్లలో ఏమీ ఉండేది కాదు. ఈ రోజు అక్కడ హైటెక్ సిటీ వెలసింది. ఈ రోజు సాఫ్ట్‌వేర్ రంగం ఇంతలా అభివృద్ధి చెందిందంటే అది బాబు గారి వలెనే అని నిస్సందేహంగా చెప్పొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉంటున్న ఎంతోమంది సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన పెద్దలు నేడు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారంటే ఆనాడు చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంత చేశారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
రాజకీయ చదరంగంలో ఎన్నో ఆటలు ఆడతారని, అయితే, చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అరెస్టు చేసి ఇన్ని రోజులు ఖైదు చేయడం చూస్తుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోందని ప్రసాద్ వాపోయారు. చంద్రబాబుకు తమ కుటుంబం సపోర్టు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.